BRS MLA Kotha Prabhakar Reddy | దుబ్బాక ఎమ్మెల్యే (Dubbaka MLA) కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రంలోని బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు విసుగు చెందుతున్నారని అన్నారు.
అవసరమైతే వారు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని, ఆ ఖర్చులన్నీ తామే భరిస్తామని చెప్పినట్లు వ్యాఖ్యానించారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి తీవ్రంగా ఉందని ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. పిల్లల నుండి పెద్దల వరకు ఏ ఒక్క వర్గం కూడా ఈ ప్రభుత్వం పట్ల సంతృప్తిగా లేరని అన్నారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే దాని గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని.. ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారని ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో మంచితనానికి చోటు లేదని.. అవసరమైతే దూకుడు ప్రదర్శిస్తానని హెచ్చరించారు. ఈ నెల 27న వరంగల్‌లో జరిగే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు దుబ్బాక నుండి భారీగా కార్యకర్తలను తరలిస్తామని ఆయన ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.