Wednesday 1st April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఆగ్రహం!

కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఆగ్రహం!

BRS B Vinod Kumar
  • రాజ్యసభను తప్పుదోవ పట్టించారని వినోద్ కుమార్ ధ్వజం!

BRS Condemns CR Patil Comments | కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ (CR Patil) రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది.

బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కేంద్ర మంత్రి వాస్తవ విరుద్ధమైన మాటలు మాట్లాడటం దురదృష్టకరమని మండిపడ్డారు.

రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల వల్ల వ్యవసాయం రెండింతలు పెరిగిందని చెబుతూనే, మరోవైపు కాళేశ్వరం వల్ల లక్ష కోట్లు నీళ్లలో కలిసిపోయాయని అనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

కాళేశ్వరంపై అవాస్తవ ప్రచారం: వినోద్ కుమార్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుకు అసలు లక్ష కోట్లు ఖర్చు కాలేదని, అలాంటప్పుడు అన్ని నిధులు వృధా అయ్యాయని చెప్పడం రాజ్యసభను తప్పుదోవ పట్టించడమేనని అన్నారు.

“కాళేశ్వరం గొప్పతనం ఏంటో మా నాయకుడు హరీశ్ రావు గారు అనేకసార్లు గణాంకాలతో సహా వివరించారు. ప్రాజెక్టులో భాగమైనవన్నీ కొట్టుకుపోయాయా? కేంద్ర మంత్రి మాటలకు అర్థం ఉందా?” అని ప్రశ్నించారు.

ఈ అంశంపై ఇప్పటికే బీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభలో నిరసన వ్యక్తం చేస్తూ లేఖ రాశారని, సభ హుందాతనాన్ని కాపాడాలంటే మంత్రి తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఏడు మండలాల విలీనంపై పోరాటం..
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలులో కేంద్రం అనుసరిస్తున్న తీరును వినోద్ కుమార్ తీవ్రంగా తప్పుబట్టారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపారని, చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా కేంద్రం నడుచుకుంటోందని ఆరోపించారు.

“విభజన చట్టానికి తూట్లు పొడిచి ఆ ఏడు మండలాలను కలిపారు. వాటిని తిరిగి తెలంగాణలో చేర్చాలి. అలాగే రాష్ట్రంలో ఎంపీల సంఖ్య పెంచాలని మేము ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గడ్డిమందు నిషేధానికి డిమాండ్..
సామాజిక అంశాలపై స్పందిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 దేశాలు గడ్డిమందు (Herbicide) వాడకాన్ని నిషేధించాయని, కేంద్ర ప్రభుత్వం కూడా మన దేశంలో దీనిపై తక్షణమే చొరవ తీసుకోవాలని వినోద్ కుమార్ కోరారు.

పర్యావరణం మరియు ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. విభజన చట్టం సవరణల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ, తెలంగాణ హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions