BRS fields Galwan martyr Santosh Babu’s mother in Suryapet poll | దేశ ప్రజల రక్షణ కోసం, శత్రు సైన్యంతో పోరాడి వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు తల్లి ఇప్పుడు ఎన్నికల బరిలో నిలిచారు. 2020 జూన్ లో లద్దాఖ్ గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో వీరోచిత పోరాటం చేసి కల్నల్ సంతోష్ బాబు అమరుడైన విషయం తెల్సిందే. తాజగా ఆయన తల్లి మంజుల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సూర్యాపేట మున్సిపాలిటీలోని 44వ వార్డు కౌన్సిలర్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు.
బీఆరెస్ తరఫున పోటీ చేస్తున్న ఆమె శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. తన కుమారుడు దేశం కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తు చేసిన ఆమె, స్థానిక ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. బీఆరెస్ పార్టీపై, ఆ పార్టీ అధినేత కేసీఆర్ పై అభిమానంతో నామినేషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన అభివృద్ధి నుంచి ప్రేరణ పొంది తాను కూడా తన వార్డుని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. సంతోష్ బాబు మరణించిన సమయంలో కేసీఆర్, జగదీష్ రెడ్డి అలాగే వార్డు ప్రజలు తన కుటుంబానికి ఎంతో అండగా నిలిచారన్నారు.









