Pakistanis Voting in TG | తెలంగాణలో ఓట్లకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (BJP) నాయకురాలు మాధవీ లత (Madhavi Latha) సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో పాకిస్థాన్ పౌరులు (Pakistan Citizens) అక్రమంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని ఆమె ఆరోపించారు.
దీని వెనుక కొన్ని రాజకీయ పార్టీల అండ ఉందన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమె ఆధారాలు ఇవే అంటే ఓ వీడియో విడుదల చేశారు. 2018 నుంచి తెలంగాణలో పాకిస్థాన్ పౌరులు అక్రమంగా ఓటు వేస్తున్నారని ఆరోపించారు.
ఈ ఓట్ల నమోదుకు నకిలీ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలను ఉపయోగిస్తున్నారని ఆమె తెలిపారు. ఈ అక్రమ కార్యకలాపాలకు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఏఐఎంఐఎం వంటి రాజకీయ పార్టీలు అండగా ఉన్నాయన్నారు.
నకిలీ పత్రాల ద్వారా ఈ పాకిస్థానీయులు బ్యాంకుల నుంచి రుణాలు కూడా పొందుతున్నారని.. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా పెను ప్రమాదం అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
కేవలం ఓటు హక్కు వినియోగించుకోవడమే కాకుండా ఈ వ్యక్తులు దేశ భద్రతకు ముప్పు కలిగించే ఉగ్రవాద కార్యకలాపాలు, ‘లవ్ జిహాద్’ వంటి వివాదాస్పద అంశాల్లో కూడా పాలుపంచుకుంటున్నారని తెలిపారు.
ఈ అక్రమ ఓటింగ్ జాతీయ భద్రతకు పెను ప్రమాదమనీ, ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు. వారి పౌరసత్వాన్ని వెంటనే రద్దు చేసి, ఈ కుట్రపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)తో విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.










