Bihar minister distributes 700 blankets in 40 degrees Celsius heat | అసలే వేసవి కాలం..పైగా బయట భయంకర ఎండలు. ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఫ్యాన్లు, కూలర్లు కింద కూర్చున్నా ఉపశమనం లభించడం లేదని కొందరు వాపోతున్నారు.
ఇలాంటి సమయంలో ఓ మంత్రి ఎండలో ఇబ్బందులు పడుతున్న వారికి ఇంకా వెచ్చదనం కోసం దుప్పట్లు పంపిణీ చేసి విమర్శల పాలయ్యారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఏప్రిల్ ఆరున, నేతలు ఘనంగా జరుపుకున్నారు.
ఇందులో భాగంగా బీహార్ రాష్ట్రం బెగుసరాయ్ జిల్లా అహియాపూర్ గ్రామంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి, బీజేపీ కీలక నేత సురేంద్ర మెహతా ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ క్రమంలో మంత్రి సురేంద్ర 700 మంది పేదలకు దుప్పుట్లు పంపిణీ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
పేదల అభ్యున్నతికి, జాతి నిర్మాణానికి కట్టుబడి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ అన్నారు. వేడుకల్లో భాగంగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఎండలు మండుతున్న ఈ సమయంలో దుప్పట్లు పంపిణీ చేయడం ఏంటని నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.
మంత్రికి అంటే ఇంట్లో ఏసీ ఉంటుంది, చల్లగా ఉంటుంది కాబట్టి దుప్పట్లు అవసరం, కానీ పేద వాళ్ళ పరిస్థితి అలా కాదు కదా అని మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.