– కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు 40 కి.మీ పాదయాత్ర!
Bandi Sanjay Padayatra | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) శనివారం అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘‘అంజన్న ఆశీర్వాద యాత్ర’’ను ప్రారంభించనున్నారు.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ పక్షాన నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించుకోనున్నారు. ఈ పాదయాత్ర కోసం కరీంనగర్ నగరం ఇప్పటికే కాషాయమయమైంది.
8 గంటల్లో 40 కిలోమీటర్లు ..
శనివారం ఉదయం 6 గంటలకు కరీంనగర్ లోని మహాశక్తి ఆలయం వద్ద అమ్మవారిని దర్శించుకున్న అనంతరం, సరిగ్గా 7 గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుంది.
సుమారు 40 కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్రలో 108 మంది బీజేపీ సర్పంచులు, 450 మంది వార్డు సభ్యులు, కార్పొరేటర్లు, మేయర్, కౌన్సిలర్లతో పాటు వేలాది మంది భక్తులు, కాషాయ శ్రేణులు పాల్గొననున్నారు.
మంత్రి బండి సంజయ్ కీలక సూచనలు:
ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నందున, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్రమశిక్షణతో నడవాలని బండి సంజయ్ పార్టీ శ్రేణులకు సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులకు సహకరించాలని కోరారు.
ఆధ్యాత్మిక భావన: ఈ యాత్ర రాజకీయాలకు అతీతంగా ఆధ్యాత్మిక భావన పెంపొందించేలా సాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఎండల దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో (37-40 డిగ్రీలు), పాదయాత్రలో పాల్గొనే వారి కోసం దారి పొడవునా స్వచ్ఛంద సంస్థలు, బీజేపీ శ్రేణులు మజ్జిగ, మంచినీరు, పులిహోర ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు.
కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు అడగడుగునా మంగళహారతులు, పూల జల్లులతో స్వాగతం పలికేందుకు మహిళలు, భక్తులు సిద్ధమయ్యారు.










