Araku Coffee Stall Set Up in Parliament Premises | పార్లమెంటులో ప్రఖ్యాత అరకు కాఫీ స్టాల్స్ సోమవారం ప్రారంభమయ్యాయి. స్పీకర్ ఓం బీర్ల అనుమతితో సోమవారం నుండి మార్చి 28 వరకు అరకు కాఫీ స్టాల్స్ నడవనున్నాయి.
ఎంపీలు అల్పాహారం తీసుకునే సంగం కాంటీన్‌లో గిరిజన కోఆపరేటివ్ సొసైటీ వీటిని ఏర్పాటు చేసింది. లోకసభ కాంటీన్‌లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అరకు స్టాల్ ప్రారంభించారు. రాజ్యసభ కాంటీన్‌లో వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జోయల్ ఓరం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ, బీజేపీ ఎంపీలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ‘మన్ కీ బాత్’ లో అరకు కాఫీ గురించి ప్రధాని నరేంద్రమోదీ ప్రస్తావించడం మరియు పార్లమెంటులో స్టాల్స్ ను ఏర్పాటు చేసేందుకు స్పీకర్ ఓం బీర్ల అనుమతిని ఇవ్వడం పట్ల సీఎం ధన్యవాదాలు తెలిపారు.
ఈ మైలురాయిని నిజం చేసిన ప్రతి ఒక్కరికీ సీఎం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది అందరికీ మరీ ముఖ్యంగా గిరిజన రైతులకు గర్వకారణమన్నారు. వారి అంకితభావం మరియు కృషి అరకు కాఫీని జాతీయ స్థాయిలో అత్యున్నత స్థాయికి తీసుకువచ్చాయని పేర్కొన్నారు.