APSRTC Sankranti Collections | ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh)లో సంక్రాంతి వేడుకలు (Sankranti Celebrations) అంగరంగ వైభవంగా జరిగాయి. హైదరాబాద్ (Hyderabad)లో స్థిరపడిన ఆంధ్రులు అంతా సొంతూళ్లకు వెళ్లడంతో ఆంధ్రలో పండుగ జోరుగా జరిగింది.
పండుగ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ (APSRTC)కి కాసుల వర్షం కురిసింది. సంక్రాంతి ప్రత్యేక బస్సులు (Sankranti Special Buses) నడపడంతో సినిమా కలెక్షన్లు తలపించేలా రికార్డు ఆదాయం నమోదయ్యింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 7200 బస్సులు ఏర్పాటు చేయగా, ఈ సీజన్ లో ఏకంగా రూ.12 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.
దాదాపు 4 లక్షల మంది ఆర్టీసీలో ప్రయాణించినట్లు వెల్లడించింది. ఇంకా తిరుగుప్రయాణాలు పూర్తి స్థాయిలో ప్రారంభం కాకపోవడంతో మరింత ఆదాయం సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఏపీఎస్ ఆర్టీసీ నడిపిన 7200 ప్రత్యేక బస్సుల్లో 2153 కేవలం హైదరాబాద్ నుంచే వెళ్లాయి.
బెంగళూరు నుంచి 375, విజయవాడ నుంచి 300 బస్సులు ఉన్నాయి. మిగిలిన సర్వీసులు ఇతర ప్రాంతాల నుంచి నడిపంచారు. అలాగే ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకూ సంక్రాంతి ప్రయాణికులు తిరిగి వెళ్లేందుకు వీలుగా 3200 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.