AP Deputy CM Pawan Kalyan Meets Indian Women Blind Cricket Team | ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో క్రికెటర్లు, శిక్షకులు, సహాయక సిబ్బందితో శుక్రవారం ఈ భేటీ జరిగింది. ప్రపంచ కప్ సాధించిన క్రికెటర్లను అభినందించి, ఒక్కో మహిళా క్రికెటర్ కు రూ.5 లక్షల చొప్పున, శిక్షకులకు రూ.2 లక్షలు చొప్పున పవన్ చెక్కులు అందించారు.
ప్రతి మహిళ క్రికెటర్ కు పట్టు చీర, శాలువాతోపాటు జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడిన బహుమతులను అందించి సత్కరించారు. మహిళా అంధ క్రికెటర్లు సాధించిన విజయం దేశానికే గర్వకారణమని కొనియాడారు. ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఉన్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులు జట్టు కెప్టన్ దీపిక, పాంగి కరుణా కుమారి ఉండటం సంతోషంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా కెప్టన్ దీపిక తమ గ్రామ సమస్యలు తెలిపారు. ఆమె శ్రీ సత్యసాయి జిల్లా హేమావత్ పంచాయతీ తంబలహట్టి తండాకు చెందినవారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం కావాలని దీపిక పవన్ ను విజ్ఞప్తి చేశారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాకి చెందిన క్రికెటర్ కరుణకుమారి చేసిన విజ్ఞప్తులపైనా తక్షణమే చర్యలు ప్రారంభించాలని పేషీ అధికారులకు పవన్ సూచించారు.









