Deputy CM Pawan Kalyan | పిఠాపురం (Pitapuram) నియోజకవర్గానికి చెందిన మైనర్ బాలిక కనిపించడం లేదు అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దృష్టికి బాలిక తల్లితండ్రులు తీసుకురావడంతో వెంటనే పోలీసు అధికారులను బాలిక ఆచూకీ కనిపెట్టాలని ఆయన ఆదేశించారు.
ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా SP పర్యవేక్షణలో పోలీసు బృందాలు అన్ని విధాలుగా విచారణ జరిపి బాలిక హైదరాబాద్ లో ఉన్నట్లుగా గుర్తించి, వెంటనే అక్కడి నుండి తీసుకొచ్చి, కౌన్సిలింగ్ ఇచ్చి తల్లితండ్రులకు అప్పగించడం జరిగింది.
పోలీసుల విచారణలో ప్రేమ మాయలో పడి బాలిక ఇష్టాపూర్వకంగా ఇంటి నుండి వెళ్లిపోయినట్లుగా తేలింది. అయితే బాలిక మైనర్ కావడంతో పోలీసులు నచ్చజెప్పి తీసుకొచ్చి మిస్సింగ్ కేసు పరిష్కరించారు.
కేసును వెంటనే పరిష్కరించి బాలిక ఆచూకీ కనిపెట్టిన పోలీస్ అధికారులను పవన్ కళ్యాణ్ అభినందించడం జరిగింది.
మైనర్ బాలికలు చాలా జాగ్రత్తగా ఉండాలి, తొందరపాటు నిర్ణయాలతో జీవితాలు పాడుచేసుకోవద్దు డిప్యూటీ సీఎం కోరారు.
ఆడపిల్లలు ముఖ్యంగా మైనర్లు చదువుకునే వయసులో ప్రేమ మాయలోనో, మరే ఇతర కారణాలతోనో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఎంతో ప్రేమగా చూసుకునే తల్లి తండ్రులకు క్షోభ మిగల్చవద్దని, అలాగే జీవితాలను పాడుచేసుకోవద్దని ఆయన సూచించారు.
ఈ వయసులో చేసే తప్పులు భావితరాలను, తల్లితండ్రుల జీవితాలను ప్రభావితం చేస్తుందని, ఎదిగే అవకాశాలు లేకుండా చేస్తుంది అనే విషయాన్ని అర్ధం చేసుకోవాలని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.