Monday 30th March 2026
12:07:03 PM
Home > క్రీడలు > పాక్ ప్లేయర్ ‘గలీజ్’ పని.. అడ్డంగా దొరికిపోయిన ఫఖర్ జమాన్!

పాక్ ప్లేయర్ ‘గలీజ్’ పని.. అడ్డంగా దొరికిపోయిన ఫఖర్ జమాన్!

Fakhar Zaman Ball Tampering | పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2026 సీజన్‌లో ఒక విస్తుపోయే సంఘటన చోటుచేసుకుంది.

పాక్ సీనియర్ బ్యాటర్ ఫఖర్ జమాన్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడుతూ కెమెరాలకు చిక్కడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది.

క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించినందుకు అంపైర్లు ఆ జట్టుపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, ప్రత్యర్థి జట్టుకు పెనాల్టీ పరుగులు కూడా కేటాయించారు.

అసలేం జరిగింది?

గడాఫీ స్టేడియం వేదికగా లాహోర్ ఖలందర్స్ మరియు కరాచీ కింగ్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. కరాచీ కింగ్స్ గెలుపునకు చివరి ఓవర్‌లో 14 పరుగులు అవసరం.

బౌలింగ్ చేయడానికి హరీస్ రౌఫ్ సిద్ధమయ్యాడు. ఈ సమయంలో ఫీల్డింగ్ చేస్తున్న ఫఖర్ జమాన్ బంతిని అందుకుని, అందరూ చూస్తుండగానే తన గోర్లతో బంతి ఆకారాన్ని మార్చడానికి (టాంపరింగ్) ప్రయత్నించాడు.

ఈ దృశ్యాలు టీవీ స్క్రీన్లపై స్పష్టంగా కనిపించాయి. బంతి ఆకారం మారడాన్ని గమనించిన అంపైర్లు వెంటనే స్పందించారు. లాహోర్ జట్టు బాల్ టాంపరింగ్‌కు పాల్పడిందని నిర్ధారించి, 5 పరుగులను పెనాల్టీగా కరాచీ కింగ్స్ ఖాతాలో వేశారు.

దీంతో లక్ష్యం ఒక్కసారిగా 9 పరుగులకు తగ్గిపోయింది. ఈ ఊరటతో కరాచీ జట్టు కేవలం మూడు బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది.

పీసీబీ కఠిన చర్యలు?

ఫఖర్ జమాన్ చేసిన ఈ పనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) తీవ్ర ఆగ్రహంతో ఉంది. వీడియో ఆధారాలను పరిశీలించిన తర్వాత అతనిపై భారీ జరిమానా లేదా కొన్ని మ్యాచ్‌ల పాటు నిషేధం విధించే అవకాశం ఉంది.

అయితే, తాను ఎలాంటి తప్పూ చేయలేదని ఫఖర్ జమాన్ బుకాయించడం గమనార్హం. ఒక సీనియర్ ప్లేయర్ అయి ఉండి, గెలుపు కోసం ఇలాంటి అడ్డదారులు తొక్కడంపై నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions