Air India Plane Crash Victims | గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం (Air India Plane Crash) కూలిన ఘటనలో విమానంలోని 241 మంది, బీజే మెడికల్ కాలేజీలోని విద్యార్థులు సహా 265 మంది మరణించారు. చాలా మంది స్థానికులు గాయపడ్డారు. ఈ ఘటన భారత ఏవియేషన్ చరిత్రలో ఒక చీకటి రోజుగా మిగిలింది.
మరణించిన వారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో కన్నీటి గాథ. గుజరాత్‌లోని వాడియాకు చెందిన అర్జున్‌భాయ్ మనుభాయ్ పటోలియా గత కొన్ని కొన్నేళ్లుగా లండన్‌లో భార్య ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. కొద్ది రోజుల కిందట అతని భార్య లండన్‌లో మరణించింది. ఆమె చివరి కోరికను నెరవేర్చేందుకు అర్జున్‌భాయ్ తన ఇద్దరు పిల్లలను లండన్‌లో వదిలి భార్య అస్థికలు తీసుకొని తన స్వస్థలానికి వచ్చాడు. బంధువులతో కలిసి వాడియాలో అస్థికలను నిమజ్జనం చేసి, ఇతర ఆచారాలను పూర్తి చేశారు.

ఆ జ్ఞాపకాలతో లండన్ లో ఉన్న తన పిల్లల వద్దకు తిరిగి రావడానికి జూన్ 12, 2025న ఎయిర్ ఇండియా విమానం AI171 ఎక్కారు. కానీ విధి అతడిని పిల్లలకు కూడా దూరం చేసింది. దీంతో అర్జున్ భాయ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అతడి తండ్రి ఇప్పటికే మరణించగా, తల్లి సూరత్ లో ఉంటోంది. కొద్దిరోజుల కిందట తల్లిని, విమాన ప్రమాదంలో తండ్రిని కోల్పోవడంతో లండన్ లో ఉన్న పిల్లలు ఇద్దరూ అనాథలయ్యారు.
పెళ్లైన ఆరు నెలల తర్వాత భర్తను కలవడానికి వెళ్తూ ఒక నవ వధువు, లండన్‌లో తన భర్త, ముగ్గురు పిల్లలతో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి బయలుదేరిన డాక్టర్ ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో విషాద గాథ. రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లా అరబా అనే చిన్న గ్రామంలో నివసిస్తున్న ఖుష్బూ రాజ్‌పురోహిత్ గత జనవరిలో లండన్ లో నివసిస్తున్న మన్ ఫూల్ సింగ్ తో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత మన్ ఫూల్ సింగ్ వెంటనే లండన్ వెళ్లిపోయారు. కాగా, ఖుష్బూ రాజ్ పుత్ వివాహం తర్వాత తొలిసారి తన భర్తను కలిసేందుకు గురువారం ఎరిండియా విమానంలో బయలు దేరింది. విమాన ప్రమాదంలో మరణించింది.

రాజస్థాన్ కు చెందిన డాక్టర్ కోమి వ్యాస్, లండన్ లో పనిచేస్తున్న ఆమె భర్త డాక్టర్ ప్రతీక్ జోషి తో కలిసి ఉండటానికి ఇటీవల తన ఉద్యోగాన్ని వదులుకున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల కిందట ఇండియా వచ్చిన తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి లండన్ లోనే స్థిరపడటానికి గురువారం ఎయిర్ ఇండియా విమానంలో బయలు దేరారు. చివరికి కుటుంబం మొత్తం ఈ ప్రమాదంలో కన్నుమూసింది. విమానం ఎక్కగానే వారు సంతోషంగా తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఇలా విమాన ప్రమాదంలో మరణించిన వారి కథలు అందర్నీ కన్నీరు పెట్టిస్తున్నాయి.
