తెలంగాణ అన్నదాతలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రైతులకు మరింత సాయం చేసే ఉద్దేశంతో త్వరలో రాయితీపై ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు అందించేందుకు సిద్ధమైంది.
వచ్చే యాసంగి సీజన్ నుంచి రైతులకు సాగుకు అవసరమైన వ్యవసాయ ఉపకరణాలు, యంత్రాలను డిస్కౌంట్ పై అందజేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా అన్నాదతలకు ట్రాక్టర్లు, నాగళ్లు, కల్టివేటర్లు, రోటోవేటర్లు, పవర్ వీడర్లు, తైవాన్ స్ప్రేయర్లు, మొక్కజొన్న ఒలిచే యంత్రాలు, కిసాన్ డ్రోన్లను ప్రతిపాదించినట్లు చెప్పారు.
జిల్లాల వారీగా రైతుల నుంచి ఉన్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకొని వ్యవసాయ పనిముట్లు, యంత్ర పరికరాల జాబితా తయారు చేసినట్లు మంత్రి వెల్లడించారు.
వ్యవసాయ పనిముట్లు, యంత్రాల తయారీ సంస్థల సహకారంతో అన్నదాతల్లో అవగాహన కల్పించేందుకు గాను జిల్లాల వారీగా ప్రదర్శనలు సైతం నిర్వహిస్తామని వెల్లడించారు. రైతు భరోసా పంట పెట్టుబడి సాయం పథకంపైనా మంత్రి తుమ్మల కీలక అప్డేట్ ఇచ్చారు.
మంత్రివర్గ ఉపసంఘం నివేదిక రాగానే.. వీలైనంత త్వరగా ఈ పథకం అమలు చేస్తామన్నారు. ఈ పథకం కింద ఎకరాకు రూ.15 వేలు (రెండు విడతల్లో) పంట పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందించనుంది.