Vijay Deverakonda Scolorships | నూతన దంపతులు విజయ్ దేవరకొండ-రష్మిక స్వగ్రామంలో సందడి చేశారు. రాజస్థాన్ ఉదయపూర్ వేదికగా ఇటీవలే ఈ జంట ఒక్కటైన విషయం తెల్సిందే.
అనంతరం హైదరాబాద్ చేరుకున్న వీరు కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలంలోని తమ స్వగ్రామం తుమ్మన్ పేటకు వెళ్లారు.
సుమారు 32 ఏళ్ల తర్వాత విజయ్ దేవరకొండ తన స్వగ్రామానికి వెళ్లారు. గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇంట్లో దేవరకొండ దంపతులు గృహప్రవేశ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
అలాగే సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నారు. ఆ తర్వాత గ్రామస్థులతో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..32 ఏళ్ల కిందట హైదరాబాద్ కు వెళ్లినా గ్రామస్థులతో విడదీయరాని అనుబంధం ఉందన్నారు.
తల్లిదండ్రుల కోరిక మేరకు స్వగ్రామంలో ఇల్లు నిర్మించుకోవడం, గ్రామస్థులకు విందు ఇవ్వడం సంతోషంగా, గర్వంగా ఉందన్నారు.
ఈ ఏడాది తుమ్మన్ పేట పాఠశాలలో 9, 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించి తొలి రెండు ర్యాంకుల్లో నిలిచిన విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందించనున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది నుండి నాగర్ కర్నూల్ డివిజన్ లోని 44 పాఠశాలల్లో దీనిని అమలు చేయనున్నట్లు తీపికబురు అందించారు.







