Sonusood Requests PM Modi | కొంతకాలంగా సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువైంది. చాలామంది సోషల్ మీడియాకు బానిస అవుతున్నారు. తద్వారా అనేక మానసిక సమస్యలు వస్తున్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా చిన్న పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం భవిష్యత్తులో అనర్థాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాపై సోనూ సూద్ కీలక వ్యాఖ్యలు చేశారు. 16 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా నిషేధం విధించాల్సిన అవసరం ఉందని పోస్ట్ చేశారు.
ప్రస్తుత కాలంలో పిల్లలు భోజనం చేస్తూ కూడా ఫోన్లు స్క్రోలింగ్ చేస్తున్నారని, ఆ విషయాన్ని తల్లిదండ్రులు సైతం పట్టించుకోకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మన భవిష్యత్తు కాకూడదని హెచ్చరించారు. ఈ క్రమంలోనే 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను దూరం చేయడం తక్షణ అవసరమని సోనూ సూద్ అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేసిందని, త్వరలో గోవా ప్రభుత్వం కూడా దీనిని అనుసరించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. దీనిని ఒక జాతీయ ఉద్యమంగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. పిల్లల మానసిక ఆరోగ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు.







