KTR slams Revanth Reddy over SIT notice to KCR’s house | ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు బీఆరెస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు అందించారు. జూబ్లీహిల్స్ నందినగర్ లోని కేసీఆర్ ఇంటి గోడకు నోటీసుల ప్రతిని అంటించారు. అయితే ఇలా గోడకు నోటీసులు అంటించడం పట్ల భగ్గుమన్నారు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి గారూ? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. స్వయంగా కేసీఆర్ తానుంటున్న నివాసం అడ్రస్‌తో సహా పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణం అని మండిపడ్డారు. ఇది అహంకారం కాకపోతే మరేమిటి? అని నిలదీశారు.
65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారుంటున్న నివాసం వద్దనే విచారించాలన్న రూల్ కూడా పోలీసులు అతిక్రమిస్తున్నారని విమర్శించారు. పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన ఉందా? లేక ముఖ్యమంత్రి చేతిలో కీలుబొమ్మల్లా ఇలా ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనా అంటూ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఎన్ని వేధింపులకు పాల్పడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని తప్పకుండా సమయం వచ్చినప్పుడు ప్రజాక్షేత్రంలోనే బుద్దిచెబుతారంటూ పేర్కొన్నారు.









