Pet Dog Stands Guard For Owner’s Dead body | పెంపుడు జంతువులకు వాటి యజమానులతో అమితమైన అనుబంధం ఉంటుంది. ముఖ్యంగా శునకాలు తమ యజమానుల పట్ల ఎనలేని విశ్వాసాన్ని కనిపిస్తుంటాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లోని భార్మౌర్ లో హృదయాన్ని కదలించే సంఘటన చోటుచేసుకుంది.
భారీగా కురుస్తున్న మంచు వల్ల కొండ ప్రాంతాల్లో అత్యవసర పనిమీద పెంపుడు శునకంతో బయటకు వెళ్లిన ఓ వ్యక్తి చలికి తట్టుకోలేక మార్గమధ్యలోనే కన్నుమూశాడు. దీంతో యజమాని మృతదేహానికి ఆ పెంపుడు కుక్క కాపలాగా అక్కడే ఉండిపోయింది.
విపరీతమైన మంచు కురుస్తున్నా, చలిగాలులు వీస్తున్నా అక్కడి నుంచి అది కదలలేదు. ఆ వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్లిన రెస్క్యూ సిబ్బందినీ కొంతసేపటి వరకు దగ్గరకు రానివ్వలేదు. యజమాని పట్ల ఆ మూగజీవానికి ఉన్న ప్రేమ, విశ్వాసం చూసి రెస్క్యూ సిబ్బందితో పాటు స్థానికులు భావోద్వేగానికి గురయ్యారు.
అంత చలిలో నాలుగు రోజుల పాటు తిండి తినకుండా, అత్యంత కఠిన వాతావరణంలోనూ ఆ శునకం తన యజమాని మృతదేహాన్ని వదలకుండా కాపలా కాసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.









