Second-Hand Car Scam Exposed in Nacharam | తప్పుడు ప్రకటన ఇచ్చిన ఓ వ్యాపారికి చుక్కలు చూపించారు ప్రజలు. కేవలం రూ.26 వేలకే కారును విక్రయిస్తున్నట్లు వ్యాపారి ప్రకటించడం వైరల్ గా మారింది. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ లో చోటుచేసుకుంది. మల్లాపూర్ కు చెందిన రోషన్ కార్ల వ్యాపారి. ఈ క్రమంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేవలం రూ.26 వేలకే కార్లను విక్రయిస్తున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు.
ఇది చూసిన స్థానికులు కార్లను కొనేందుకు ఆసక్తితో సోమవారం ఉదయమే షాపు వద్దకు భారీగా చేరుకున్నారు. కానీ విక్రయానికి కార్లు లేవని రోషన్ చెప్పడంతో అక్కడికి వచ్చినవారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపూరిత ప్రకటన అని అర్ధం చేసుకుని రాళ్లతో షాపుపై దాడి చేశారు. ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న పోలీసులు రోషన్ పై కేసు నమోదు చేసి నాచారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.









