Woman Attacks Doctor’s Wife With HIV Injection | ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో దారుణ ఘటన వెలుగుచూసింది. తన మాజీ ప్రియుడ్ని పెళ్లి చేసుకుందనే ద్వేషంతో ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. మాజీ ప్రియుడి భార్యకు ఇంజక్షన్ సహాయంతో హెచ్ఐవీ వైరస్ ను ఎక్కించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కర్నూలుకు చెందిన ఓ వైద్యుడు ఆదోనికి చెందిన వసుంధర అనే నర్సు కొన్నేళ్ల క్రితం ప్రేమించుకున్నారు. ఆ తర్వాత విడిపోయారు. అనంతరం సదరు డాక్టర్ మరో మహిళను వివాహం చేసుకున్నారు. ఆమె కర్నూలు మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. జనవరి 9న అసిస్టెంట్ ప్రొఫెసర్ విధులు ముగించుకుని తన స్కూటీపై ఇంటికి వెళ్తున్నారు. ఈ సమయంలో నలువురు వ్యక్తులు స్కూటీని ఢీ కొట్టడంతో వైద్యుడి భార్య కిందపడిపోయారు. ఈ క్రమంలో ఆమెకు సహాయం చేస్తున్నట్లు నటించిన వసుంధర అత్యంత భయంకరమైన హెచ్ఐవీ వైరస్ ను ఎక్కించారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు కర్నూలు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు. అయితే తన మాజీ ప్రియుడిని పెళ్లి చేసుకుందని ద్వేషంతో వారిని విడదీయాలనే కుట్రలో భాగంగానే నిందితురాలు ఇలా చేసినట్లు డీఎస్పీ బాబు ప్రసాద్ తెలిపారు.









