CCL 2026: Akhil Akkineni | నటుడు అఖిల్ అక్కినేని విధ్వంసకర బ్యాటింగ్ తో అభిమానులను అలరించారు. సిక్సులు, ఫోర్లతో పరుగుల వరదను పారించారు. దింతో తెలుగు వారియర్స్ జట్టు ఘన విజయం సాధించింది. సెలబ్రెటీ క్రికెట్ లీగ్-2026లో భాగంగా శనివారం వైజాగ్ లోని వీసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో తెలుగు వారియర్స్-పంజాబ్ దే షేర్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి టాలీవుడ్ జట్టు తొలుత బ్యాటింగ్ కు దిగింది. అఖిల్ అక్కినేని, అశ్విన్ బాబు అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ కు ఏకంగా 132 పరుగులు జోడించారు. ఈ క్రమంలో అఖిల్ అక్కినేని ఏడు ఫోర్లు, ఆరు సిక్సులతో చెలరేగిపోయారు. 180 స్ట్రైక్ రేట్ తో కేవలం 56 బంతుల్లోనే 101 పరుగులు చేశారు.
అఖిల్ విధ్వంసకర బ్యాటింగ్ చూసి అభిమానులు సంబరపడ్డారు. అశ్విన్ బాబు కూడా 60 పరుగులు చేశారు. నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన తెలుగు వారియర్స్ జట్టు 184 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చెదనలో పంజాబ్ జట్టు చేతులెత్తేసింది. 132 పరుగుల వద్దే ఆల్ ఔట్ అయ్యింది. కరణ్ వాహి 56 పరుగులతో ఒంటరి పోరాటం చేశారు. ఇకపోతే తెలుగు వారియర్స్ బౌలర్లు వినయ్ మహాదేవ్ 3, సామ్రాట్ రెండు వికెట్లు తీశారు.









