Reservations for Corporation Mayors and Municipal Chairpersons | తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్ పర్సన్ల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఈ మేరకు రిజర్వేషన్ వివరాలను వెల్లడించారు మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి. 121 మున్సిపాలిటీల్లో ఐదు ఎస్టీ, 17 ఎస్సి, 38 బీసీలకు కేటాయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం స్థానాల్లో 50 శాతం మహిళలకు కేటాయించారు. ఇకపోతే 10 కార్పొరేషన్లకు సంబంధించి ఎస్టీ 1, ఎస్సి 1, బీసీలకు 3 దక్కాయి. హైదరాబాద్ పరిసర మున్సిపాలిటీల విలీనంతో జీహెచ్ఎంసీలో 300 వార్డులకు ఎన్నికలు జరగనున్న విషయం తెల్సిందే.
ఈ సారి జనరల్ మహిళకు ప్రతిష్టాత్మకమైన జీహెచ్ఎంసీ మేయర్ పదవి దక్కనుంది. కొత్తగూడెం కార్పోరేషన్ ఎస్టీ జనరల్ కు రిజర్వ్ అయ్యింది. రామగుండం ఎస్సి జనరల్, మహబూబ్నగర్-బీసీ మహిళ, మాంచిర్యాల, కరీంనగర్-బీసీ జనరల్ కు రిజర్వ్ అయ్యాయి. ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ కార్పొరేషన్లు మహిళా జనరల్ కు రిజర్వ్ అయ్యాయి. ఇకపోతే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ జనరల్ కు కేటాయించింది ప్రభుత్వం.









