Telangana Municipal Elections: Final Voter Count Revealed | తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న విషయం తెల్సిందే. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. రిజర్వేషన్లు ఖరారు అయిన తర్వాత నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. మొత్తం 123 మున్సిపాలిటీలకు సంబంధించి జాబితాను వెల్లడించింది. ఇందులో ఆరు కార్పొరేషన్ల కూడా ఉన్నాయి. 123 మున్సిపాలిటీల్లో కలిపి 2,996 వార్డులు ఉన్నాయి.
113 మున్సిపాలిటీల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మొత్తం 52,43,023 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 26,80,014 మంది మహిళలు, 25,62,369 పురుషులు, 640 మంది ఇతరులు ఉన్నారు. నిజామాబాద్ కార్పోరేషన్ లో అత్యధికంగా 3 లక్షల 48 వేల మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా కొత్తగూడెంలో లక్ష 34 వేల మంది ఓటర్లు ఉన్నారు. అదిలాబాద్ మున్సిపాలిటీలో అత్యధికంగా లక్ష 43 వేల మంది ఓటర్లు, అత్యల్పంగా అమరచింత మున్సిపాలిటీలో 9,147 మంది ఓటర్లు ఉన్నారు.









