Jadeja-Samson trade | ఐపీఎల్ 2026 సీజన్ సరికొత్తగా సందడి చేయనుంది. స్టార్ ఆటగాళ్లు సరికొత్త ఫ్రాంఛైజీలో కనిపించనున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 12 ఏళ్ల పాటు కనిపించిన జడేజా తిరిగి రాజస్థాన్ రాయల్స్ కు వెళ్లారు.
జడేజా తన తొలి రెండు ఐపీఎల్ సీజన్లు రాజస్థాన్ తరఫునే ఆడారు. ఇకపోతే అందరూ ఊహించిన విధంగానే సంజు శాంసన్ చెన్నైకి వచ్చేశాడు. 2013లో సంజు ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇవ్వగా 2016, 17 సీజన్లలో మినహా మిగిలిన అన్ని సీజన్లలో అతడు రాజస్థాన్ తరఫునే ఆడారు. ఇకపోతే జడేజాకు చెన్నై గతేడాది రూ.18 కోట్లు చెల్లించింది. కానీ రూ.4 కోట్ల తక్కువ చెల్లించి రూ.14 కోట్లకే జడేజాను ట్రేడింగ్ ద్వారా రాజస్థాన్ సొంతం చేసుకోవడం విశేషం.
జడేజాతో పాటు సామ్ కరన్ కూడా చెన్నై నుండి ఆర్ఆర్ కు వెళ్లిపోయారు. ఇకపోతే గతేడాది మాదిరిగానే సంజుకు రూ.18 కోట్లు చెల్లించేందుకు చెన్నై సిద్ధం అయ్యింది. ఎంఎస్ ధోని తర్వాత భవిష్యత్ లో చెన్నై తరఫున వికెట్ కీపర్ బ్యాటర్ గా సంజు కనిపించే అవకాశం ఉంది. అయితే సంజును కెప్టెన్ గా చెన్నై నియమిస్తుందని ఊహాగానాలు వచ్చాయి. కానీ రుతురాజ్ గైక్వాడ్ చెన్నై కెప్టెన్ గా కొనసాగుతారని యాజమాన్యం స్పష్టం చేసింది. ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ కోసం చెన్నై వద్ద రూ.43.40 కోట్లు ఉండగా, 9 మంది ప్లేయర్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. మరోవైపు రాజస్థాన్ వద్ద రూ.16.05 కోట్లు ఉన్నాయి. తొమ్మిది మంది ప్లేయర్లను కొనే అవకాశం ఉంది.









