Andesri Passes away | ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ రచయిత అందెశ్రీ (AndeSri) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురవగా, కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1961 జూలై 18న ఆయన సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. చదువుకోకున్నా కేవలం తన ప్రతిభతోనే కవిగా రాణించారు. తన పాటలు, రచనలతో ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.
ఉద్యమ సమయంలో ఆయన గీతాలు ప్రజల్లో స్ఫూర్తిని రగిలించాయి. ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’ అనే పాట తెలుగు ప్రజల మనసును హత్తుకుంది. అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ’ అనే గీతాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అధికారిక గీతంగా గుర్తించింది.
అందెశ్రీ మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ఇతర ప్రముఖ నాయకులు, సాహితీవేత్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అందెశ్రీకి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.









