Maharashtra Farmer Gets Rs.6 For Crop Loss Compensation | భారీ వర్షాలు ఆ తర్వాత సంభవించిన వరదల మూలంగా మహారాష్ట్ర లో భారీగా పంట నష్టపోయింది. అయితే పంట నష్టపోయిన కొందరి రైతులకు ప్రభుత్వం చెల్లించిన పరిహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరాఠ్వాడా ప్రాంతం ఛత్రపతి సంభాజీనగర్ జిల్లా పైథన్ మండలం నందర్ గ్రామంలో బుధవారం మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పర్యటించారు.
వర్షాల మూలంగా నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగానే దిగాంబర్ సుధాకర్ తాంగ్డే అనే రైతు మీడియాతో మాట్లాడారు. వర్షాల మూలంగా తన రెండెకరాల పొలంలో పంట పూర్తిగా నష్టపోయిందని అయితే ప్రభుత్వం కేవలం రూ.6 పరిహారం మాత్రమే చెల్లించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రైతులను అవమానించడమే అని అన్నారు. ఈయనతో పాటు మరికొంతమంది రైతులు తమకు రూ.3, రూ.21 చొప్పున పరిహారం అందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో స్పందించిన ఉద్ధవ్ రాష్ట్రం మరియు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రైతుల బాధలను ఎగతాళి చేస్తుందని విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉండగా వర్షాలు, వరదల మూలంగా లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయాయి. ఈ క్రమంలో ప్రభుత్వం రూ.31 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. అయితే ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన కింద రైతులకు పరిహారం వచ్చింది. ఇందులో భాగంగానే రూ.6, రూ.3, రూ.21 ఇలా చిల్లర డబ్బులు పరిహారం రూపంలో వచ్చాయని అక్కడి రైతులు మండిపడుతున్నారు.








