Mamdani seals remarkable victory | ఉచిత బస్సు ప్రయాణం హామీ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు సుపరిచితమే. ఇప్పుడు ఇదే పథకం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాకిచ్చింది. తాజగా అమెరికా స్థానిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో భారత మూలాలు ఉన్న జోహ్రాన్ మమదాని భారీ విజయం సాధించారు.
డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మమదానిని ఓడించేందుకు స్వయంగా డోనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. అయినప్పటికీ మమదాని ఘన విజయం సాధించారు. న్యూయార్క్ మేయర్ గా ఎన్నికైన తొలి ముస్లింగా, భారతీయ అమెరికన్ గా చరిత్ర సృష్టించారు. పెట్టుబడి దారులకు స్వర్గధామం అయిన అమెరికాలో తనను తాను సోషలిస్టుగా మమదాని ప్రకటించుకున్నారు. క్యాపిటలిస్టులు అధికంగా ఉండే న్యూయార్క్ నగరంలో సోషలిస్టు అయిన మమదాని విజయం సాధించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల సమయంలో ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరమైన న్యూయార్క్ లో ప్రజలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తానని మమదాని హామీ ఇచ్చారు. అలాగే నగరంలోని ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తేవడం, ప్రభుత్వ పాఠశాలలకు నిధులు పెంచడం, అందరికీ విద్య అవకాశాలను సమానం చేయడం, అద్దె నియంత్రణను బలోపేతం చేయడం, అద్దెదారుల హక్కులను రక్షించడం వంటివి ఆయన ప్రకటించిన కీలక హామిలు. ఇకపోతే ఈ పథకాల అమలుకు నిధుల కోసం అత్యంత సంపన్న ఒక శాతం ప్రజలపై రెండు శాతం పన్నులను అధికంగా విధిస్తానని ప్రకటించారు.









