AI Fake Video Call Scam | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఓ ఘరానా మోసగాడు ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమ పేరు చెప్పి టీడీపీ నాయకులను మోసం చేశాడు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన పలువురు టీడీపీ నాయకులు వేల రూపాయలు ఘరానా మోసగాడికి చెల్లించి మోసపోయినట్లు ఆలస్యంగా గ్రహించారు.
సెప్టెంబర్ 30న సత్తుపల్లిలోని టీడీపీ నాయకులకు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తాను దేవినేని ఉమా పీఏను అని నమ్మించాడు. ఆ తర్వాత కాసేపట్లో ఉమా సార్ వీడియో కాల్ చేసి మాట్లాడుతారు అని చెప్పాడు. చెప్పినట్టుగానే టీడీపీ నేతలకు వీడియో కాల్ వచ్చింది. ఇక్కడే మోసగాడు ఏఐని వినియోగించాడు. వీడియో కాల్ లో ఏఐ సహాయంతో ఉమానే మాట్లాడినట్లు అతడు ఫేక్ కాల్ చేశాడు.
అనంతరం తెలంగాణలోని టీడీపీ కార్యకర్తల పిల్లల చదువు కోసం సహాయం చేయాలని మూడు ఫోన్ పే నంబర్లను పంపాడు. ఇది నిజమని అనుకున్న టీడీపీ నేతలు రూ.35 వేలు చెల్లించారు. అక్టోబర్ 7న తిరిగి దేవినేని ఉమా పేరుతో మోసగాడు మళ్లీ ఫోన్ చేశాడు. తెలంగాణ స్థానిక సంస్థలు ఎన్నికల్లో బీ ఫార్మ్ ఇప్పిస్తాను, ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో వీడియో కాల్ మాట్లాడుతారు అని చెప్పాడు. అన్నట్టుగానే మళ్లీ వీడియో కాల్ వచ్చింది. చంద్రబాబును పోలిన ఓ వ్యక్తి ఏఐ సహాయంతో మాట్లాడాడు.
అమరావతి వచ్చి బీ ఫార్మ్ లు తీసుకెళ్లాలని చెప్పాడు. విజయవాడలోని ఓ హోటల్ లో దిగాలని, బిల్లు తానే చెల్లిస్తానని మోసగాడు హామీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో 18 మంది సత్తుపల్లి టీడీపీ నాయకులు విజయవాడ వెళ్లి హోటల్ లో దిగారు. ఈ సమయంలో మళ్లీ మోసగాడు ఫోన్ చేసి, ముఖ్యమంత్రిని కలిసేందుకు 8 మందికే అనుమతి ఉంది, ఒక్కొక్కరు రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇది విన్న నేతలకు అనుమానం వచ్చింది. ఇదే సమయంలో భోజనాల బిల్లు కట్టాలని హోటల్ సిబ్బంది అడిగారు.
దింతో నేతలకు, హోటల్ సిబ్బందికి వాగ్వాదం మొదలయ్యింది. ఈ సందర్భంగా పోలీసులు రంగంలోకి దిగారు. విషయం తెలుసుకుని దేవినేని ఉమాకు ఫోన్ చేశారు. తాను వీడియో కాల్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తన పేరుతో ఓ మోసగాడు ఇలా ఫోన్ చేస్తున్నాడని వివరించారు. తాము మోసపోయామని గ్రహించిన తెలంగాణ టీడీపీ నేతలు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పరువు పోతుందని ఇంటికి పయనమయ్యారు.









