Asia Cup-2025 Final | ఆసియా కప్-2025లో తుదిపోరుకు సర్వం సిద్ధమయ్యింది. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో భారత్-పాకిస్థాన్ జట్లు ఫైనల్స్ లో తలపడడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ మ్యాచుపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ఆసియా కప్ ప్రారంభంలో పాకిస్థాన్ తో మ్యాచును బాయ్ కాట్ చేయాలని డిమాండ్లు వచ్చాయి. అయితే ఆ తర్వాత నెలకొన్న కొన్ని పరిణామాలు ఫైనల్స్ పై భారీ అంచనాలు నెలకొల్పాయి. గ్రూప్ స్టేజి మ్యాచులో భాగంగా పాకిస్థాన్ ప్లేయర్లతో కరచాలనం చేసేందుకు టీం ఇండియా ప్లేయర్లు నిరాకరించడం, ఆ మ్యాచ్ విజయాన్ని పహల్గాం ఉగ్రదాడి బాధితులకు అంకితమిస్తున్నట్లు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ప్రకటించడంతో జట్టుపై అభిమానులు ప్రశంసలు కురిపించారు.
అయితే సూపర్-4 లో మళ్లీ భారత్-పాక్ తలపడ్డాయి. ఈ సందర్భంగా పాక్ ఆటగాళ్లు ఇండియన్ ఫ్యాన్స్ ను రెచ్చగొట్టే విధంగా చేసిన వెకిలి చేష్టలపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. అనంతరం బీసీసీఐ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నాయి. ఇలాంటి ఘటనల నేపథ్యంలో ఫైనల్స్ ఆసక్తిగా మారింది. ఈ క్రమంలోనే ఇప్పటికే మ్యాచ్ జరగనున్న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలోని టికెట్లు పూర్తిగా అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.









