Producer SKN Fires On Recent Issues In TFI | సినీ కార్మికులకు 30 శాతం వేతనాలు పెంచాలనే డిమాండ్ టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో పలువురు చిన్న నిర్మాతలు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్మాత ఎస్కెఎన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగితే, సినిమా బడ్జెట్ విషయంలో బాధ్యత తీసుకోగలిగితే 50 శాతం వేతనాలు పెంచడానికైనా సిద్ధమే అని తెలిపారు. పరిశ్రమలో 90 శాతం సినిమాలు చిన్న నిర్మాతలవే అని స్పష్టం చేశారు.
చిన్న నిర్మాతలు చాలా కష్టాల్లో ఉన్నారని, పెద్ద సినిమాలకు వర్తించే టికెట్ ధరలు వంటివి చిన్న సినిమాలకు ఉండవని గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో 30 శాతం వేతనం పెంచాలనే డిమాండ్ ఎంతవరకు సరైందని ప్రశ్నించారు.
ఏ హీరో కూడా మాకింత ఇవ్వకుంటే షూటింగ్స్ బంద్ అని అనడం లేదని పరిస్థితి అర్ధం చేసుకుని సినిమాలు చేస్తున్నారని చెప్పారు. యూనియన్స్ కూడా ఇది మన ఇండస్ట్రీ, మన నిర్మాతలు అనే భావనతో పనిచేయాలని సూచించారు. ఇదే సమయంలో డైరెక్టర్స్ అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎవరి వైపు ఉన్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.









