Komatireddy Rajgopal Reddy News | మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం మంత్రి పదవి హామీ ఇచ్చిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.
కానీ మంత్రివర్గ కూర్పులో సమీకరణాల కారణంగానే ఆయనకు మంత్రి పదవి ఇంకా రాలేదని చెప్పారు. భట్టి వ్యాఖ్యల నేపథ్యంలో కోమటిరెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు మంత్రి పదవి ఇస్తామన్న హామీని అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్య నేతలు అడ్డుకుంటూ, అవమానిస్తున్న వాస్తవాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించిన భట్టికి ధన్యవాదాలు అని తెలిపారు కోమటిరెడ్డి.
తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని పేర్కొన్నారు. ప్రజలు తమకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కారు అమలు చేయాలని, అవినీతి రహిత పాలన అందించాలని కోరుతున్నట్లు వెల్లడించారు. తెలంగాణ సమాజ ఆకాంక్షలను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉండాలని ఆశిస్తున్నట్లు రాజగోపాల్ రెడ్డి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.









