Andhra Pradesh News | ఆంధ్రప్రదేశ్ లో 18 ఏళ్ళు నిండిన మహిళలకు ‘ఆడబిడ్డ’ నిధి కింద నెలకు రూ.1500 అందించే పథకంపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఈ పథకం అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మేయాలని మంత్రి వ్యాఖ్యానించారు. అనంతరం ఈ పథకం అమలు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచిస్తున్నారని, త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అయితే మంత్రి వ్యాఖ్యలపై వైసీపీ ఘాటుగా స్పందించింది.
ఆడబిడ్డ నిధి పథకానికి ముఖ్యమంత్రి ఎగనామం పెట్టేశారని జగన్ పార్టీ వినర్శలు గుప్పించింది. మరోవైపు మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజినీ స్పందించారు. ఒక్క హామీని అమలు చేయకుండా సుపరిపాలనకు తొలి అడుగు అంటూ టీడీపీ వాళ్లు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు.
చంద్రబాబు ఏమో సంపద సృష్టిస్తా, సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పారని కానీ ఇప్పుడేమో అచ్చెన్నాయుడు ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మాలంటూ మాట్లాడుతున్నారని నిలదీశారు. సంక్షేమ పథకాలు అమలు చేయలేనప్పుడు ఎందుకు హామీలు ఇచ్చారు? అని మాజీ మంత్రి రజినీ ప్రశ్నించారు.








