Chiranjeevi pays floral tribute Kota Srinivasa Rao | తెలుగు సినిమా ప్రపంచ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. కొద్దిరోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆదివారం తెల్లవారుజామున ఫిల్మ్ నగర్ లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు.
ఈ నేపథ్యంలో సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కోట మృతిపట్ల అగ్ర నటుడు చిరంజీవి స్పందించారు.
‘లెజెండరీ యాక్టర్ , బహుముఖ ప్రజ్ఞాశాలి కోట శ్రీనివాస రావు గారు ఇక లేరు అనే వార్త ఎంతో కలచివేసింది. ‘ప్రాణం ఖరీదు’ చిత్రం తో ఆయన నేను ఒకే సారి సినిమా కెరీర్ ప్రారంభించాము. ఆ తరువాత వందల కొద్దీ సినిమాల్లో ఎన్నెన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి, ప్రతి పాత్రని తన విలక్షణ, ప్రత్యేక శైలి తో అలరించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయారు కోట. కామెడీ విలన్ అయినా సీరియస్ విలన్ అయినా, సపోర్టింగ్ క్యారక్టర్ అయినా, ఆయన పోషించిన ప్రతి పాత్ర ఆయన మాత్రమే చేయగలడు అన్నంత గొప్పగా నటించారు. రీసెంట్ గా ఆయన కుటుంబం లో జరిగిన వ్యక్తిగత విషాదం ఆయన్ని మానసికంగా ఎంతగానో కుంగదీసింది. కోట శ్రీనివాస రావు లాంటి నటుడు లేని లోటు చిత్ర పరిశ్రమ కి, సినీ ప్రేమికులకి ఎన్నటికీ తీరనిది.ఆయన ఆత్మ కి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకి, శ్రేయోభిలాషులకి, అభిమానులకి , నా ప్రగాఢ సంతాపం తెలియ చేస్తున్నాను.’ అని చిరంజీవి పేర్కొన్నారు.









