Badaun Same Sex Marriage News | ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు యువతులు వివాహం చేసుకున్న ఘటన సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చనీయాంశమైంది.
ఈ సంఘటన బదాయూ జిల్లా కోర్టు ప్రాంగణంలోని శివాలయంలో చోటుచేసుకుంది. ఈ యువతులు తమకు పురుషులపై ఆసక్తి లేదని, గత మూడు నెలలుగా పరస్పర అనురాగంతో కలిసి జీవిస్తున్నామని వెల్లడించారు. వారు దండలు మార్చుకుని, సాంప్రదాయ పద్ధతిలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
అంతేకంటే ముందు కోర్టు ప్రాంగణంలో ఓ న్యాయవాదిని కలిసి తమకు న్యాయ సహాయం చేయాలని కోరారు. అయితే భారతదేశంలో స్వలింగ వివాహాలను చట్టం అంగీకరించిందని ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ యువతులు వివాహానికి సిద్ధమయ్యి, దండలు మార్చుకున్నారు.
బదాయూ జిల్లాకు చెందిన ఈ ఇద్దరు యువతులు తమ ప్రేమను బహిరంగంగా ఒప్పుకున్నారు. ఈ వివాహానికి పలువురు న్యాయవాదులు కూడా హాజరయ్యారు. అనంతరం యువతులు మీడియాతో మాట్లాడుతూ, తాము ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటున్నామని, సమాజం ఏమనుకున్నా తమ నిర్ణయంతో సంతోషంగా ఉన్నామని తెలిపారు.
పురుషులతో వివాహం చేసుకోవడం తమకు ఇష్టం లేదని, ఒకరికొకరు జీవిత భాగస్వాములుగా ఉండాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. కాగా భారతదేశంలో స్వలింగ వివాహాలు చట్టపరంగా గుర్తింపు పొందలేదు.
2018లో సుప్రీంకోర్టు భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 377ని రద్దు చేసి, స్వలింగ సంబంధాలను నేరం నుంచి మినహాయించినప్పటికీ, స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపు ఇంకా లభించలేదు.









