Sunita Williams Finally Returns To Earth | భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ ( Sunita Williams ) సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భూమికి చేరుకున్నారు. అమెరికా లోని ఫ్లోరిడా తీరంలో ఆమె సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. ఈ క్రమంలో ఆమె రాక కోసం ఎదురుచూసిన వారు సంబరాలు చేసుకున్నారు.
కేవలం ఎనమిది రోజుల యాత్ర కోసం సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ గతేడాది జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అయితే సాంకేతిక సమస్యల కారణంగా వారు తొమ్మిది నెలల పాటు ఐఎస్ఎస్ లోనే ఉండాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వారి రాక కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ క్యాప్సుల్ ( SpaceX’s Crew Dragon spacecraft ) లో వారిని భూమికి తీసుకువచ్చారు. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకు ఫ్లోరిడా తీరంలో ఈ క్యాప్సుల్ ల్యాండ్ అయ్యింది.
ఆ వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి, క్యాప్సుల్ నుండి వ్యోమగాములను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఇదే క్యాప్సుల్ లో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ( Butch Wilmore ) తో పాటుగా స్పేస్‌ఎక్స్ క్రూ-9 వ్యోమగామి నిక్ హేగ్ ( Nick Hague ), రష్యన్ వ్యోమగామి ( Aleksandr Gorbunov ) అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా భూమికి చేరుకున్నారు.