Harish Rao About SLBC Tunnel Accident | ఎస్ఎల్బీసీ ( SLBC ) టన్నెల్ ప్రమాద ఘటనలో చిక్కుకున్న ఎనమిది మంది కార్మికుల ప్రాణాలు కాపాడే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు.
ఈ మేరకు బీఆరెస్ నేతలతో కలిసి టన్నెల్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..రెస్క్యూ ఆపరేషన్ ( Rescue Operation ) లో భాగంగా ఆరు రోజుల తర్వాత కూడా తీసింది కేవలం తట్టెడు మట్టి మాత్రమేనని విమర్శించారు.
ఇప్పటి వరకు సరైన డైరెక్షన్ లేదన్నారు. మంత్రులు పొద్దున వస్తున్నారు.. సాయంత్రం పోతున్నారు.. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ఏమైనా టూరిస్ట్ ప్లేసా? అంటూ హరీష్ ప్రశ్నించారు. ఎస్ఎల్‌బీసీ ప్రమాద ఘటన జరిగి ఆరు రోజులైనా ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి రాలేదని, ఎందుకిత బాధ్యతా రాహిత్యం? అని నిలదీశారు.
SLBC వద్దనే ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలుస్తాం అంటే పోలీసులు అడ్డుకున్నారని, ప్రతిపక్ష నాయకులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలవడానికి వస్తే పోలీసులతో నిర్బంధిస్తారా అంటూ హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సహాయక చర్యల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం లేకుంటే ఎందుకు కలవనివ్వడం లేదని ప్రశ్నించారు.









