- తెలంగాణ పథకాలపై కలెక్టర్లకు సీఎస్ కీలక ఆదేశాలు!
Indiramma Indlu | రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న నాలుగు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కీలక ఆదేశాలు జారి చేశారు. ఈనెల 21వ తేదీ నుండి నిర్వహించే గ్రామ సభలలో లబ్ధిదారుల జాబితా ఆమోదం పొందాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ఈనెల 26 వ తేదీన ప్రారంభించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తగు కార్యాచరణపై జిల్లా కలెక్టర్లతో నేడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.
ఈ సందర్భంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, ఈ నాలుగు ప్రతిష్టాత్మక పథకాలకు లబ్దిదారుల ఎంపికలో ఏవిధమైన అపోహలకు తావివ్వకూడదని స్పష్టం చేశారు. ఈ పథకాలన్నీ నిజమైన అర్హులకే దక్కేలా పకడ్భందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
రైతు భరోసాకు సంబంధించి భూముల వివరాలను రెవిన్యూ శాఖ ద్వారా వ్యవసాయ శాఖకు పంపడం జరిగిందని, సాగుయోగ్యంకానిభూములను క్షేత్ర స్థాయిలో తనిఖీ నిర్వహించాలని అన్నారు. సంయుక్త సందర్శనలు నిర్వహించి, గ్రామసభల్లో వ్యవసాయ యోగ్యం కాని భూముల వివరాలు ప్రదర్శించి, చదివి వినిపించి ఆమోదం పొందాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి, ఉపాధిహామీ పథకంలో కనీసం 20 రోజులు పనిచేసిన భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాల జాబితాను, గ్రామ సభల్లో ప్రకటించి ఆమోదం పొందాలని సి.ఎస్ తెలిపారు.రేషన్ కార్డుల మంజూరీకై రూపొందించిన లబ్ధిదారుల ముసాయిదా జాబితా గ్రామసభల్లో ఆమోదం పొందాలన్నారు.
ఇదేవిధంగా, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విషయంలో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శక సూత్రాల ఆదేశాలకు అనుగుణంగా లబ్ధిదారుల ముసాయిదా జాబితా ను గ్రామాలలో ప్రదర్శించాలనిఅన్నారు.
గ్రామీణ ప్రాంతాలలో, గ్రామపంచాయతీల వారిగా మరియు పట్టణ ప్రాంతాల్లో వార్డుల వారిగా సభలు నిర్వహించాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున, లబ్ధిదారుల జాబితా ఎంపిక, డాటా ఎంట్రీ, క్షేత్ర స్థాయి వెరిఫికేషన్ తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జీహెచ్ఎంసీ కమీషనర్ ను ఆదేశించారు.
ఇప్పటివరకు, ఈ నాలుగు పథకాలకు సంబంధించి క్షేత్ర స్థాయి పరిశీలన, ప్రత్యేక బృందాల ఏర్పాటు, ముసాయిదా జాబితా తయారీ, డేటా ఎంట్రీ ఏర్పాట్లు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు చేసిన ప్రత్యేక శ్రద్ధని సి.ఎస్ అభినందించారు. ఈ నాలుగు పథకాల అమలుకై రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక అనుగుణంగా అమలయ్యేలా సంబంధిత కార్యదర్శులు పర్యవేక్షించాలని సి.ఎస్. శాంతి కుమారి ఆదేశించారు.
ఈ టెలి కాన్ఫరెన్స్ లో రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శిడి.ఎస్. చౌహాన్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి బుద్ధప్రకాష్, పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, జీహెచ్ఎంసి కమిషనర్, తదితరులు పాల్గొన్నారు.