AP Municipal Statutes Amendment Bill-2024 | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (AP Assembly) ఓ కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. పట్టణ, స్థానిక సంస్థల్లో పోటీ నిబంధనలు మార్చే బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉంటే పట్టణ, స్థానిక సంస్థల్లో పోటీచేసేందుకు అనర్హులు.
ఈ నేపథ్యంలో ఈ నిబంధనను మారుస్తూ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అసెంబ్లీలో మున్సిపల్, శాసనాల సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
ఎంత మంది పిల్లలు ఉన్నా కూడా పట్టణ, స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించే ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
ఇక ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఆమోదం, గవర్నర్ సంతకం తర్వాత ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. జనాభా వృద్ది రేటు పెంపుదలలో భాగంగానే ఈ మార్పులు చేసినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.
ఈ బిల్లుతో పాటు ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు, ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ సవరణ బిల్లు, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక బిల్లు సహా తదితర ఏడు ఇతర కీలక బిల్లుల ఆమోదించింది.
వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీ పేరును.. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీగా మార్చిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం లభించగా.. తాజాగా అసెంబ్లీలోనూ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. మండలి ఆమోదం తర్వాత ఉత్తర్వులు జారీ చేస్తారు.