Indian Railway Super App | భారతీయ రైల్వే (Indian Railways) ప్రయాణికులకు ఓ శుభవార్త చెప్పనుంది. రైల్వేకు సంబంధించి అన్నిరకాల సేవలు ఒకేచోట లభించేలా ఓ సూపర్ యాప్ (super app) త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది.
ప్రస్తుతం రైల్వేకు సంబంధించి వివిధ సేవల కోసం వేర్వేరు యాప్ లు, వెబ్సైట్లు ఉన్నాయి. ఆన్లైన్ టికెట్ల బుకింగ్ కోసం ఐఆర్ సీటీసీ రైల్ కనెక్ట్, అన్ రిజర్వుడు టికెట్ల కోసం యూటీఎస్ యాప్, ఫుడ్ ఆర్డర్ కోసం ఐఆర్సీటీసీ ఈ కేటరింగ్ ఫుడ్ ఆన్ ట్రాక్, ఫిర్యాదులు, ఫీడ్ బ్యాక్ కోసం రైల్ మదద్ లాంటి యాప్స్ ఉన్నాయి.
ఈ సేవలన్నీ సూపర్ యాప్ ద్వారా ఒకచోట చేర్చనున్నారు. రైల్వేకు సంబంధించిన ఈ సూపర్ యాప్ ని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (CRIS) అభివృద్ధి చేస్తోంది. ఈ యాప్ అందుబాటులోకి వస్తే ట్రైన్ టికెట్ బుకింగ్ తో పాటు ప్లాట్ఫామ్ టికెట్, అన్ రిజర్వ్ టికెట్లనూ ఒకేచోట బుక్ చేసుకోవచ్చు.
ట్రైన్ రన్నింగ్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. ఈ ఏడాది డిసెంబర్ చివరికి సరికొత్త యాప్ ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు భారతీయ రైల్వే సంబంధిత వర్గాలు వెల్లడించాయి.