BJP MLA Katipally | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాటి సీఎం కేసీఆర్(KCR)ను మరియు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ని ఓడించి ఎమ్మెల్యే గా గెలిచిన వెంకటరమణారెడ్డి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు.
అసెంబ్లీ ఎన్నికల్లో రూ.150 కోట్లతో సొంత మేనిఫెస్టో ను ప్రకటించిన ఆయన తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి పాత బస్టాండ్ నుండి అడ్లూరు వరకు రోడ్డు విస్తరణకు ఆమోదం లభించినప్పటికీ ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. ట్రాఫిక్ పెరిగిపోవడం, పలుచోట్ల ఆక్రమణలతో ఈ రోడ్డు ఇరుకుగా మారింది.
కాగా ఇదే మార్గంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గృహాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో రోడ్డు విస్తరణ కోసం స్వచ్చందంగా తన ఇంటిని కూల్చేందుకు సిద్ధమయ్యారు వెంకటరమణ రెడ్డి.
వెయ్యి గజాలకు పైగా సొంత ఇంటి స్థలాన్ని బల్దియాకు అప్పగించారు. ఇందులో భాగంగా పది రోజుల క్రితమే ఇంటిని ఖాళీ చేసి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు కు మారారు.
దీంతో శనివారం ఉదయం బల్దియా అధికారులు ఎమ్మెల్యే ఇంటిని కూల్చివేశారు. కాగా రోడ్డు విస్తరణ కోసం స్వచ్చందంగా ఇంటి స్థలాన్ని ఇచ్చిన ఈ ఎమ్మెల్యే తీరు పట్ల నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.