Revanth Vs KTR | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana assembly) నాలుగోరోజు వేడెక్కాయి. అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం జరిగింది.
ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మాజీ మంత్రి కేటీఆర్ (KTR) మధ్య వాడివేడిగా విమర్శలు జరిగాయి.
శుక్రవారం గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం ప్రారంభమైన సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి (Governor Speech) ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ప్రతిపాదించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్లు ఎన్నో నిర్బంధాలకు గురయ్యామన్నారు. ప్రజల కోసం ఎదైనా నిరసనకు పిలుపునివ్వగానే ఇంటి ముందు పోలీసులు ఉండే వాళ్లని ఆరోపించారు.
కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సీఎం అయిన 24 గంటల్లోనే ప్రగతి భవన్ కంచెలు తొలగించారని గుర్తు చేశారు.
అనంతరం విపక్ష నేత కేటీఆర్ మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గవర్నర్ దారుణమైన ప్రసంగం విన్నాక రాష్ట్రం ఎలా ఉండబోతుందో అర్థం అవుతోందని వ్యాఖ్యనించారు.
ఆ ప్రసంగం విని సభ్యుడిగా తాను సిగ్గుపడుతున్నాని చెప్పారు. నక్క మోసం చేయనని, పులి మాంసం తినను అని వాగ్వాదం ఇచ్చినట్లు గవర్నర్ ప్రసంగం ఉందని ఎద్దేవా చేశారు.
తాము ఎక్కడ ఉన్నా ప్రజల పక్షమేనన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదని, ఢిల్లీ నామినేట్ చేసీ ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలనలో త్రాగు, సాగు, కరెంట్ దిక్కు లేదని విమర్శించారు.
నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ తప్ప ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో 50 ఎకరాల రైతు అయినా సరే గుంపు మేస్త్రిలాగా ఉండేవారని అన్నారు. ఆనాడు బొంబాయి, దుబాయ్, బొగ్గు బావులు తప్ప మరేంలేవని మండిపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి గతంలో సభ్యుడిగా ఉన్న సమయంలో ఆయన తండ్రి చనిపోతే.. అనాడు స్నానాలు చేయటానికి నీళ్లులేని పరిస్థితులు ఉండేవని గుర్తు చేశారు.
64 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడే ఇంత మిడిసిపాటు వద్దని కేటీఆర్ హెచ్చరించారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ పేరును మట్టితో కప్పినంత మాత్రాన చరిత్ర చెరిగిపోదని చెప్పారు.
ఆతర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. కొంతమంది ఎన్ఆర్ఐలకు ప్రజాస్వామ్యం విలువ తెలియదని పరోక్షంగా కేటీఆర్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వానికి ఐదేళ్ల సమయం ఉందని.. జరిగిన విధ్వంసం బయటపడతాయన్నారు.
కేటీఆర్ మేనేజ్ మెంట్ కోటాలో రాజకీయాల్లోకి వచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు రాజకీయ జీవితం ప్రసాదించిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. యూత్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా, కేంద్రమంత్రిగా కేసీఆర్ పదవులు కట్టబెట్టినట్లు గుర్తు చేశారు.
వైఎస్ఆర్ పాలనలో కేసీఆర్ కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా లేకుండా మంత్రిగా చేశారని తెలిపారు. గతం గురించి చర్చ చేద్దాం అంటే.. ఒక్క రోజు సమయం ఇవ్వండి అన్నీ లెక్కలు తీద్దామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ 9 ఏళ్ల పాలనపై ఎక్స్ రే తీస్తానని అన్నారు.
చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు కేటీఆర్ మేనేజ్‌మెంట్ కోటాలో వచ్చారని వ్యాఖ్యలు చేశారు. కేకే మహేందర్ రెడ్డికి అన్యాయం చేశారన్నారు. పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవని కేటీఆర్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతి పక్షాలను గౌరవించే సంప్రదాయం కాంగ్రెస్ పార్టీకి ఉందని అన్నారు.