Friday 2nd May 2025
12:07:03 PM
Home > తాజా > మంత్రి కాకుండానే ముఖ్యమంత్రిగా.. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిదీ!

మంత్రి కాకుండానే ముఖ్యమంత్రిగా.. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిదీ!

cm revanth reddy

Revanth Reddy Political Journey | తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ (TPCC Chief Revanth Reddy), కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎంపికయ్యారు. ఈ విష‌యాన్ని పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో మీడియా స‌మావేశం నిర్వ‌హించి అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ నేపథ్యంలో గురువారం ఉద‌యం 10:28 గంట‌ల‌కు రేవంత్ రెడ్డి సీఎంగా ప్ర‌మాణ‌ స్వీకారం చేయ‌నున్నారు.

రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదీ! (Revanth Reddy Political Journey)

తెలంగాణ రెండో సీఎంగా ఎంపికైన అనుముల రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న ఉమ్మ‌డి మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గంలోని కొండారెడ్డి పల్లెలో నరసింహారెడ్డి, రామచంద్రమ్మ దంపతులకు జన్మించారు. రేవంత్ రెడ్డికి మొత్తం ఆరుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. ఉస్మానియా అనుబంధ కాలేజీ ఏవీ కాలేజీలో డిగ్రీ(ఫైన్ ఆర్ట్స్) పూర్తి చేసిన రేవంత్ రెడ్డి 2002లో అప్పటి టీఆరెస్ లో చేరారు. అనంతరం 2006లో జెడ్పీటీసీ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

2008లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. మరోసారి ఇండిపెడెంట్ గా గెలుపొందారు. అనంతరం రేవంత్ రెడ్డి టీడీపీలో చేరారు.  2009 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తిరిగి 2014 ఎన్నిక‌ల్లో వరుసగా రెండోసారి కూడా విజయం సాధించారు. 2014 నుంచి 2017 మధ్య టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. 2017 అక్టోబరులో టిడిపికి రాజీనామా చేసి, కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2018లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాధ్యతలు చేపట్టారు.

అయితే, 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తిరిగి 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ కి బరిలోకి దిగి  విజయం సాధించారు. 2021లో జూన్ 26న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియమితులయ్యారు.

రాష్ట్రంలో నలుగురు ఎంపీలు ఉన్న బీజేపీ, అధికార బీఆరెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న క్రమంలో కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన రేవంత్ తన నాయకత్వంలో పార్టీకి నూతన జవసత్వాలు తెచ్చారు. తన మాటలతో కేసీఆర్ ను ఢీకొంటూ కాంగ్రెస్ కార్యకర్తల్లో కొత్త ఆశలు చిగురింపజేశారు.

చివరికి తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా పర్యటించి పార్టీ అభ్యర్థుల గెలుపునకు చెమటోడ్చారు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో గెలుపొంది అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ అధిష్టానం ఆశీస్సులతో రేవంత్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. డిసెంబర్ 7న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

రేవంత్ రెడ్డి తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఏ నాడు మంత్రిగా పనిచేయలేదు. కనీసం అధికారంలో కూడా లేడు. కానీ, నేడు మంత్రిగా అనుభవం లేకుండానే ముఖ్యమంత్రిగా పాలనాపగ్గాలు చేపట్టనున్నారు.

You may also like
cm revanth reddy
ఆ విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శం: సీఎం రేవంత్!
tg ssc results
పదో తరగతి ఫలితాల్లో ఈ జిల్లా టాప్!
cm revanth reddy
కేసీఆర్ ప్రసంగంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏమన్నారంటే!
cm revanth meets jana reddy
జానా రెడ్డితో సీఎం రేవంత్ భేటి.. కారణం ఏంటంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions