CM Revanth Reddy | కొడితే కుంభస్థలన్నే కొట్టాలి అంటారు పెద్దలు. సరిగ్గా ఇది రేవంత్ రెడ్డికి వర్తిస్తుంది. సుమారు 20 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నా ఏనాడు అధికార పార్టీలో లేరు, మొదటి సారి అధికారంలోకి వచ్చి నేరుగా ముఖ్యమంత్రి కాబోతున్నారు ఈ ‘కొండంత’ రెడ్డి రేవంత్ రెడ్డి (Revanth Reddy).
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మిత్ర పక్షం తో కలిపి 65 సీట్లలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టబోతుంది.
సుమారు రెండు రోజుల పాటు ఎమ్మెల్యే ల అభిప్రాయాలు తీసుకొని సీనియర్ నేతలతో మంతనాలు జరిపి చివరికి అనుముల రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ప్రకటించింది అధిష్టానం.
దింతో కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉండగా సుదీర్ఘ రాజకీయ పోరాటం చేసి, ఆటుపోట్లను తట్టుకొని నిలబడి, కేసీఆర్ తో కలబడి ఆఖరికి చరిత్ర సృష్టించారు రేవంత్ రెడ్డి.
తెలంగాణ కాంగ్రెస్ పరిశీలకులు అయిన డీకే శివ కుమార్ మరియు మానిక్ రావు ఠాక్రే మంగళవారం నాడు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ లతో భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో సీఎల్పీ నేతను నిర్ణయించినట్లు తెలుస్తుంది. అయితే మరోవైపు ఉత్తమ్, భట్టి ఢిల్లీలో డీకే, మానిక్ రావు ఠాక్రే లతో భేటీ అయ్యి సీఎం ఎంపిక పై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కి ఢిల్లీ అధిష్టానం నుండి పిలుపువచ్చింది. దీంతో రేవంత్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.