హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేశారు. తొమ్మిదిన్నరేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగారు. రాష్ట్రంలో 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ అందించడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. ప్రభాకర్ రావు 22 ఏళ్ల వయసులోనే విద్యుత్ శాఖలో చేరారు. 2014, జూన్ 5న జెన్ కో సీఎండీగా బాధ్యతలు స్వీకరించారు. అదే ఏడాది అక్టోబర్ 25న ట్రాన్స్‌కో ఇంఛార్జిగా నియమితులయ్యారు. మొదట ప్రభాకర్ రావును రెండేళ్ల పదవీ కాలానికే సీఎండీగా సర్కారు నియమించినప్పటికీ.. ఆ తర్వాత పదవీ కాలాన్ని పొడిగిస్తూ వచ్చింది. కాగా.. బీఆర్ఎస్ ఓడిపోవటంతో.. తాజాగా ఆయన తన పదవికి రాజీనామా చేశారు. కాగా.. ఆయన సంస్థకు మొత్తంగా 54 ఏళ్లపాటు సేవలందించినట్టయింది. ఇక మరోవైపు.. సాంస్కృతిక సలహాదారుగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ రమణాచారి కూడా రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను సీఎస్‌కు పంపించినట్టు తెలుస్తోంది. అయితే.. పలువురు రిటైర్ట్ ఉద్యోగులు, ఐఏఎస్‌లను బీఆర్ఎస్ ప్రభుత్వం అదే శాఖలో నామినేటెడ్ పోస్టుల్లో కొనసాగించింది. అయితే.. వీళ్ల పని తీరుపై గతంలో రేవంత్ రెడ్డి పలు మార్లు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కాగా.. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యే అవకాశాలు కన్పిస్తుండటంతో.. వాళ్లంతా రాజీనామాలు చేస్తున్నారు. సాయంత్రంలోపు మరికొంత మంది కూడా రాజీనామాలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.