Tomato Price | గత కొద్దిరోజులుగా కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. ముఖ్యంగా టమాటా ధర రోజురోజుకీ ఆకాశన్నంటుతోంది.
సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కేజీ టమాట రూ. 100 నుండి రూ.160 దాకా పలుకుతోంది.
ఆంధ్ర ప్రదేశ్ లోని అన్నమయ్య, అనంతపూర్ జిల్లాలు, కర్ణాటక లోని కోలార్, చిక్ బల్లాపూర్ లో టమాట సాగు ఎక్కువగా జరుగుతుంది.
కానీ ఈ సారి పంటకు తెగులు రావడం వల్ల దిగుబడి చాలా వరకు తగ్గింది. దీంతో మార్కెట్లో టమాటకు తీవ్ర కొరత ఏర్పడింది.
మరోవైపు ఇటీవల వర్షాలు కురవడం వల్ల కూడా పంట దెబ్బతినింది. దీంతో అందుబాటులో ఉన్న టమాట ధరకు రెక్కలు వచ్చాయి.
ఆసియాలోనే అతిపెద్ద టమాట మార్కెట్లలో ఒకటి అయిన మదనపల్లి టమాట మార్కెట్ కూడా టమాట ఎక్కువగా రావడం లేదని వారు అంటున్నారు. ఒడిశా, మహారాష్ట్రలో టమాట పంట బాగా దెబ్బతిన్నది.
దీంతో టమాట పండించే, పండించని రాష్ట్రాలలో కూడా డిమాండ్ కు తగ్గ సరుకు అందుబాటులో లేదు. దేశవ్యాప్తంగా టమాట ధరలు వీపరితంగా పెరిగాయి.
తమిళనాడు ప్రభుత్వ కీలక నిర్ణయం..
టమాట ధరలు విపరీతంగా పెరగడం వల్ల తమిళనాడులో ఉన్న డీఎంకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
టమాట రూ.120 నుండి రూ160 ఉండటం వలన సామాన్య జనాలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో కాస్త ఉపశమనం కలిగిస్తోంది.
ధరను నియంత్రించి, సామాన్యులకు టమాటను అందుబాటులోకి తీసుకు రావడానికి రేపటి నుండి రేషన్ షాపులో టమాట కేవలం రూ.60 కె ప్రభుత్వం విక్రయించనుంది.
ఈ నిర్ణయం పట్ల తమిళనాడు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను అభినందిస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ డిమాండ్ పెరుగుతోంది.
తమిళనాడు మాదిరిగానే రైతు బజార్లు లేదా రేషన్ షాపుల్లో టమాటను తక్కువ ధరకు విక్రయించే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.