BRS In Maharashtra | తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆరెస్ పేరును బీఆరెస్ గా మార్చిన తర్వాత జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన విషయం తెలిసిందే.
మిగతా రాష్ట్రాల్లో పార్టీ సంగతి ఎలా ఉన్నా పొరుగున ఉన్న మహారాష్ట్రపై ద్రుష్టి కేంద్రీకరించారు. ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్ర కమిటీని ప్రకటించినప్పటికీ ఇంతవరకు పర్యటించలేదు.
తెలుగు వాళ్ళు అధికంగా ఉండే కర్ణాటక రాష్టం లో జరిగిన ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా కేవలం మహారాష్ట్ర పైనే దృష్టి సారించారు.
తరచు మహారాష్ట్ర లో పర్యటిస్తూ రైతు బంధు, ఉచిత విద్యుత్, రైతు భీమా పథకాల విశిష్టతని వివరిస్తున్నారు. ఇటీవలే భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు.
అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లడానికి సంసిద్ధం అవుతోంది బీఆరెస్. అలాగే కొన్ని రోజుల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తొలి విజయం సాధించింది.
ఛత్రపతి శభాజీ నగర్ జిల్లా గంగఖేడ్ తాలూకా లోని సవార్ గావ్ గ్రామం లో సుశమ విష్ణు ములె అక్కడి పంచాయతీ ఎన్నికల్లో నెగ్గడం ద్వారా బీఆరెస్ కి ఖాతా తెరిచింది.
నాటి నుంచి పార్టీలో చేరికలు కూడా జరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం లాతూర్ జిల్లా కు చెందిన వివిధ పార్టీల నాయకులు బీఆరెస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఆ జిల్లా జనతా పార్టీ అధ్యక్షులు జయసింగ్ యాదవ్, వన్ రాజ్ రాథోడ్ , అర్జున్ రాథోడ్ బగ్వంత్ కులకర్ణి తదితర కాంగ్రెస్ నాయకులు బీఆరెస్ లో చేరారు.
ఎన్సీపీకి చెందిన భగీరథ భాల్కే హైదరాబాద్ లో కేసీఆర్ తో సమావేశం అయ్యారు. కేసీఆర్ పందన్ పూర్ లో జరిగే సభలో ఆయన బీఆరెస్ పార్టీ లో చేరనున్నారని వార్తలు వస్తున్నాయి.
బీజేపీ మహిళా నేతకు సీఎం పదవి ఆఫర్..
మహారాష్ట్ర రాజకీయాలపై దూకుడు పెంచిన బీఆరెస్, అక్కడ వివిధ పార్టీల్లోని అసంతృప్త నేతలపై కన్నేసింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లోని వివిధ నాయకులకు గాలం వేస్తోంది.
అందులో భాగంగానే గత కొన్ని రోజులుగా బీజేపీ పైన తీవ్ర అసంతృప్తి మాజీ మంత్రి పంకజ ముండేను టార్గెట్ చేసింది బీఆర్ఎస్.
ఫడ్నవిస్ కాబినెట్ లో మంత్రి గా పనిచేసిన తనని ఏకనాథ్ షిండే ప్రభుత్వం లో పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇది బీజేపీ నాయకులే కావాలని చేస్తున్నారు వాపోతున్నారు.
ఇటీవలే నేను బీజేపీ నేతను మాత్రమే కానీ, బీజేపీ నా పార్టీ కాదు అని తీవ్ర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఈ తరుణంలో ఆమెను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని మహారాష్ట్ర బీఆరెస్ ప్రకటించింది.
పంకజ ముండే బీఆరెస్ లో చేరితే ఏకంగా ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేసింది.
పంకజ ముండే లాంటి సమర్థవంతమైన నాయకురాలు తమ పార్టీ కి అవసరమని బీఆరెస్ రాష్ట్ర కన్వీనర్ బలసాహెబ్ సనాప్ వ్యాఖ్యానించారు.
ఆమె బీఆరెస్ లో చేరితే మహారాష్ట్రలో తమ పార్టీకి తిరుగుండదనీ, అందుకే ఆమెను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని పేర్కొన్నారు.