23 School Kids In One Auto At Nagarkurnool | తరచూ రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన సంఘటనలు కలిచివేస్తున్నప్పటికీ కొందరు మాత్రం మారడం లేదు. అది కూడా అభంశుభం తెలీని పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే నాగర్ కర్నూలులో కనిపించింది.
ఓ ఆటో డ్రైవర్ తన వెహికిల్ లో ఏకంగా 23 మంది స్కూలు పిల్లల్ని కుక్కి వారిని పాఠశాలకు తీసుకెళ్తున్నాడు. 23 మంది పిల్లలు, ఒక డ్రైవర్, పిల్లల స్కూలు బ్యాగులు మరియు లంచ్ బాక్సులు ఇలా ఒకే ఆటోలో కనిపించడం చూసిన ట్రాఫిక్ పోలీసు షాక్ అయ్యారు. ఆ వెంటనే ఆటోను ఆపేసి పిల్లల్ని లెక్కించారు. మొత్తం 23మంది పిల్లలు ఉండడంతో వెంటనే ఆటోను సీజ్ చేశారు.
అనంతరం రెండు వేర్వేరు వాహనాల్లో పిల్లల్ని పాఠశాలకు పంపించారు. ఆటోకు చిన్న ప్రమాదం జరిగినా 23మంది పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని తెలిసినా ఇంతటి నిర్లక్ష్యం ఎందుకని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఆటో డ్రైవర్ తన లాభం కోసం ఇలా చేస్తున్నా, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎందుకని ఇలా కిక్కిరిసిన ఆటోలో పంపిస్తున్నారని నిలదీస్తున్నారు.








