24 Died in Chevella Bus Accident | రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో రాష్ట్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టిన దుర్ఘటనలో 24 మంది ప్రయాణికులు మరణించారు.
ఈ దారుణ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు హృదయవిదారకంగా ఉన్నాయి. మృతుల్లో 15 నెలల చిన్నారి, ఆమె తల్లి కూడా ఉన్నారు. తల్లి తన ఒడిలో పాపను పట్టుకొని ఉండగానే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. కంకరలో కూరుకుపోయిన ఆ తల్లీబిడ్డల మృతదేహాలను చూసిన స్థానికులను కంటతడిపెట్టించాయి. ఓ
కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెళ్లెల్లు మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరితరం కాలేదు. తాండూరు నుంచి హైదరాబాద్‌లోని కాలేజీలకు వెళ్తున్న విద్యార్థులే ఈ బస్సులో ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరికొందరు ప్రయాణికులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.






