HYDRA Demolished TDP MLA Vasantha Krishna Prasad’s Constructions | ఆంధ్రప్రదేశ్ మైలవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ హైదరాబాద్ లోని కొండాపూర్ అఫీజ్ పేట పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు.
వసంత హోమ్స్ పేరుతో భారీ విల్లాలు, అపార్ట్మెంట్ల నిర్మాణాలు చేపట్టారు. మొత్తం 39 ఎకరాల్లో వెంచర్లు వేశారు. సర్వే నంబర్ 79 గా పేర్కొంటూ అనుమతులు తీసుకున్నారు.
ఇదే సమయంలో తాము రోజూ ఆడుకునే చోట ఆడనివ్వడంలేదని.. అక్కడ చెరువును కూడా మాయం చేస్తున్నారని.. రహదారులు నిర్మిస్తున్నారని క్రికెట్ ఆడుకునే యువకుల ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగింది. శేరిలింగంపల్లి మున్సిపాలిటీ, కొండపూర్లోని ఆఫీజపేట సర్వే నంబర్ 79లో మొత్తం 39.2 ఎకరాలు ఉండగా ఇప్పటికే సగానికి పైగా నిర్మాణాలు జరిగాయని, సర్వే నంబరు 79 ప్రభుత్వ భూమి, నిషేధిత జాబితాగా రెవెన్యూ రికార్డులలో నమోదై ఉందని కానీ ఆ సర్వే నంబరు 79/1 గా సృష్టించి ప్రభుత్వ వ్యవస్థలను తప్పుదోవ పట్టించి వసంత హోమ్స్ సంస్థ అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు హైడ్రా పేర్కొంది.
ఇప్పటికే 19 ఎకరాలను కాజేసి ఇళ్లు నిర్మించి అమ్మేసి.. ఇంకా ఖాళీగా ఉన్న 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆఫీసు కార్యాలయంతో పాటు.. పలు షెడ్డులు ఏర్పాటు చేసి వివిధ సంస్థలకు అద్దెకు ఇచ్చినట్లు హైడ్రా గుర్తించింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఆక్రమణలను హైడ్రా నేలమట్టం చేసింది.