YSR News | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా నేతలు నివాళులర్పించారు.
ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు మాజీ మంత్రి రఘువీరారెడ్డి. వైఎస్ఆర్ హయాంలో కళ్యాణమస్తు అనే సామూహిక వివాహాల పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెల్సిందే.
అయితే ఈ పథకాన్ని ప్రారంభించడానికి వైఎస్ఆర్ ను ప్రోత్సహించిన ఘటనను రఘువీరారెడ్డి గుర్తుచేసుకున్నారు.
‘మా పెద్దనాన్న నీలకంఠాపురం శ్రీరామ రెడ్డి గారి శతజయంతి ఉత్సవాలలో పాల్గొనేందుకు, 06/10/2006న రాజశేఖర్ రెడ్డి అన్న మా నీలకంఠాపురం గ్రామానికి విచ్చేసారు. ఆ సందర్భంలో ఆలయంలో జరిగిన కుంభాభిషేకంలో ఆయన పాల్గొన్నారు. అర్చకులు, నీలకంఠాపురం దేవస్థానాల విశేషాలను వివరించుతూ, 1982 నుండి ఈ దేవాలయంలో జరుగుతున్న ఉచిత సామూహిక వివాహాల గురించి తెలియజేశారు. రాజశేఖర్ అన్న ఆ విషయాన్ని ఎంతో ఆసక్తిగా ఆలకించారు. కార్యక్రమం పూర్తయ్యాక అందరం తిరుపతి బయలుదేరాము. హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నప్పుడు రాజశేఖర్ అన్న , “రఘు, ఈ సామూహిక వివాహాల కార్యక్రమాన్ని మనం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి. పేదలు పెళ్లిళ్ల ఖర్చును భరించలేక అప్పుల పాలు అవుతున్నారు,” అని అన్నారు. తిరుపతిలో దిగగానే టీటీడీ చైర్మన్‌ను, ఈ.ఓ.ను పిలిపించి, అదే రోజు సాయంత్రానికి “కళ్యాణమస్తు” అనే ఉచిత సామూహిక వివాహాల పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి శ్రీకారం చుట్టారు. దేవుని దయతో, ఈనాటికీ ఉచిత సామూహిక వివాహాలు నీలకంఠాపురం దేవస్థానాల్లో విజయవంతంగా కొనసాగుతున్నాయి.’ అని రఘువీరారెడ్డి చెప్పారు.