YSRTP To Merge in Congress | సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల తన పార్టీలో కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారనే వార్తలకు మరింత బలం చేకూరుతోంది.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనానికి ఏకంగా ముహుర్తం కూడా ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మంగళవారం ఆమె పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో ఉదయం 11 గంటలకు అత్యవసరంగా సమావేశం అయ్యారు. పార్టీ విలీనం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
కాంగ్రెస్ లో YSRTP విలీనంపై ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. విలీన ప్రక్రియ దాదాపుగా తుది దశకు చేరినట్లు తెలుస్తోంది. బుధవారం తన పార్టీ నేతలతో కలిసి షర్మిల డిల్లీ వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ లో వైటీపీ విలీనం, భవిష్యత్ కార్యాచరణపై డిల్లీ వేదికగా రేపు కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వైఎస్ షర్మిల జనవరి 4 నాటికి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. షర్మిల చేరికతో కాంగ్రెస్ లో కొత్త జోష్ రానుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
దివంగత నేత రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న వార్తలతో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం పెరిగింది.
ఇప్పటికే ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ఆమెను రాకను స్వాగతిస్తున్నామని ఆహ్వానం పలికారు. పలువురు కాంగ్రెస్ నేతలు కూడా షర్మిల రాకను ఆహ్వానిస్తున్నారు. అలాగే ఆమె రాకతో కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా 10 నుంచి 15 శాతం ఓట్లు పెరిగే అవకాశమున్నట్లు అంచానా.